సమాజం నిరంతరం ముందుకు ప్రగతి పథాన సాగుతూనే ఉంటుంది. సమాజంలో పలు రకాల ధోరణులు సమాజ ప్రగతికి ఆటంకంగా పరిణమిస్తాయి. వాటి నుండి బయటపడడానికి సమాజము మరిన్ని కొత్త గుణాలతో ధోరణులను సృష్టించుకుని పనికిమాలిన ధోరణులను పక్కదోవ పట్టించడం గానీ లేదా నాశనం చేయడం గానీ జరుగుతుంది. ఈ ధోరణులన్నీ సమాజంలో గల వారి ద్వారానే ప్రకటితం అవుతాయి. సమాజాన్ని ఉన్న స్థితి నుండి మరింత ఉన్నతంగా తీసుకెళ్లే అటువంటి లక్షణాలే ఆదర్శాలు. ఆ ఆదర్శాలను మనము చరిత్రలో గాని పురాణాలలో గాని గమనించవచ్చు.ఇటీవల కాలంలో రాముడు మాత్రమే దేవుడు అనే విధంగా ప్రచారం సాగుతూ ఉన్నది. అందులోనూ అయోధ్యలో ఉన్న రాముడు మాత్రమే దేవుడు అనే విధంగా ప్రచారం సాగించ బడుతుంది. జైశ్రీరామ్ అనని వాడు హిందూ దేశంలో ఉండకూడదు అనే విధంగా కూడా ప్రచారం కొనసాగుతున్నది.రాజుగా గద్దెనెక్కి రాజభోగాలు అనుభవించాల్సిన తరుణంలో తండ్రి మాట కోసం అన్నింటినీ వదులుకొని నేరుగా రాముడు వనవాసానికి వెళ్ళాడు. పితృ భక్తిలో ఆదర్శ ప్రాయమయ్యాడు.తన వనవాసానికి కారణమైన కైకేయి గారిని ఎప్పటి వలెనే పూజ్య భావంతో, గౌరవంగా వ్యవహరించాడు. ఎక్కడ కూడా ఏ సందర్భంలోనూ కైకేయి గారిని వ్యతిరేక భావనతో మాట్లాడలేదు. ఈ లక్షణం ఎంత ఆదర్శమో! ఆలోచించండి. పాజిటివ్ దృక్పథం మాత్రమే ఉపయోగపడే విధంగా వుంటుంది.తనను కోరి వచ్చిన శూర్పణఖ ను తనకు భార్య ఉందని చెప్పి, గౌరవంగా తిరస్కరించిన రాముడు తన భార్య పట్ల గల సమర్పణ భావన ను వ్యక్తీకరించి రాముడు ఆదర్శప్రాయుడయ్యాడు. శూర్పణఖ పట్ల కించిత్తు కూడా తేలిక భావనను సైతం కనబరచలేదు. ఆ విధంగా స్త్రీల పట్ల రాముడికి గల గౌరవభావము తెలుస్తున్నది.తన భార్య సీత కోసం పడరాని పాట్లు పడ్డాడు. వెతుకుతున్న క్రమంలో రావణాసురునితో యుద్ధమే చేయవలసి వచ్చినది. యుద్ధములో రావణాసురుడు అన్నీ కోల్పోయి, నిస్సహాయుడయ్యాడు. యుద్ధ నియమాల ప్రకారం పొద్దుగుంకితే యుద్ధాన్ని విరమించాలి. కాబట్టి రావణాసురుడిని మరుసటి రోజు రమ్మని గౌరవంగానే చెప్పాడు. శత్రువు పట్ల ఎలా ఉండాలో ఈ సంఘటన మనకు నేర్పుతున్నది. శత్రువుతోనైనా మర్యాద పూర్వకంగానూ నియమాల ప్రకారము గానూ వ్యవహరించాలనేది మనకు అర్థము కావలసిన సందేశం లేదా గుణపాఠం.రాముడిని సీత అనుమానించింది. కానీ సీతను రాముడు అత్యంత శ్రద్ధతో ప్రేమతో ఉన్నాడు. భార్యా వియోగంతో బాధపడ్డాడు. కానీ అనుమానించలేదు. తదుపరి రాజ్యాన్ని నడపగలిగిన వీరుల కోసం అశ్వమేధ యాగాన్ని చేశాడు. అశ్వాన్ని బంధించి, తనతో సైతం పోరాడి సమర్థతను చాటుకున్న కుశలవులకే తన రాజ్యాన్ని అప్పజెప్పాడు.రాముడు సీతాదేవిని అడవులకు పంపాడు. ఒక చాకలి తిప్పడు చేసిన వ్యాఖ్యలు ఆధారంగా అనుమానించి, సీతాదేవిని నిండు చూడాలని కూడా చూడకుండా, అడవులలో విడిచిపెట్టి రమ్మని లక్ష్మణుని ఆదేశించినట్లు కథలు వినపడుతూ ఉన్నాయి. రామాయణము ఒక విశ్వాసము. ఏది చెప్పినా చెల్లుతుందని ఏదో ఒకటి రాసి జనం పైన పడవేయడం సమంజసం కాదు.ఆదర్శప్రాయమైన రాజు రాముడు. తన భార్య ఏమిటో స్పష్టంగా తెలిసినవాడు. విచక్షణా జ్ఞానం ఉన్న మహారాజు. అలాంటి వ్యక్తి భార్య పట్ల మరో రకంగా ఎలా ఆలోచించగలరు. కాబట్టి వాస్తవానికి ఏమి జరిగిందో మనము చూద్దాం. భార్య గర్భవతి అయినందున కలిగిన సంతానము రాముడైనా రాజు యొక్క సంతానము కాబట్టి నౌకర్లు చాకర్లు పట్టించుకోరు పిల్లలు ఏమైనా తప్పులు చేస్తే రాజకుమారుడు కాబట్టి ఆ విషయాన్ని రాజు దృష్టికి కూడా వచ్చే అవకాశం కావున సమర్ధుడైన రాజు యొక్క పిల్లలు భవిష్యత్తులో మంచి విద్యావంతులు అన్ని రకాలుగా సమర్థులు అయినవారుగా ఎదగాలంటే తన వద్ద ఉంచుకోకూడదు అన్న ఉద్దేశంతో నిండు చూలాలైన సీతాదేవి గారిని అడవులకు పంపించాడు. పిల్లలు జ్ఞాన సమపార్జకులై అమోఘమైన సమర్థతను అష్టాశస్త్ర విద్యలలో మరింత ప్రయోజకులయ్యారు. నేడు గల్లీ కౌన్సిలర్ కార్పొరేటర్లు కూడా తన పిల్లలు ఎమ్మెల్యేలుగా మంత్రులుగా కావాలని కోరుకుంటారు. అందుకు డబ్బును విచ్చలవిడిగా వెదజల్లుతారు. రాముడు రాజు. తన తదుపరి రాజ్యపాలన చేయడానికి తగిన శక్తి సామర్థ్యాలు కలిగిన వారు కావాలన్న ఉద్దేశంతోనే కానలకంపాడు. అశ్వమేధ యాగం చేశాడు తద్వారా తన పిల్లలు అలాంటి సమర్థత శక్తి సామర్థ్యాలు లోకానికి ప్రదర్శించిన అనంతరమే రాజ్యపాలనకు అవకాశం కల్పించారు.జైశ్రీరామ్, జైశ్రీరామ్ అనే దానిని ఒక నినాదంగా మార్చి, రామ భక్తులకు ఇచ్చి, ప్రజలకు ధర్మాన్ని లేదా మతాన్ని ఇచ్చి ఆ పారవశ్యంలో మన కేంద్ర సర్కారు ముంచేసింది. మన ప్రధానమంత్రి మోడీ గారు మన దేశ సంపదను తన దోస్తులకు ఇస్తున్నారు.ప్రభుత్వం అంటే కేవలం మతపరమైన కార్యకలాపాలకే పరిమితం అనే భావన కలుగజేస్తున్నారు. మరో దిక్కు రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన సంస్థలన్నింటిని కొంతమంది కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా వ్యవహరించడానికి మార్చి వేస్తున్నారు.సంక్షేమ పథకాలు అంటే ఏవగింపు. ప్రజలే పన్ను చెల్లింపు దారులు. కాగా పన్ను చెల్లింపుదారులు కార్పొరేట్ కంపెనీలు అనే ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు.సంక్షేమ పథకాలు అంటే ఉచితంగా సర్కారు సొమ్మును తినే సోంబేరులు అనే ప్రచారం సాగుతుంది. తద్వారా సంక్షేమ పథకాలు దేశద్రోహకర విధానాలు అని హిందూ ధర్మం అనే ముసుగు క్రింద తప్పుడు భావనలను ప్రజలలో తీసుకెళ్తున్నారు. మరోపక్క తాము అవసరమైన భావించిన పరిస్థితుల్లో సంక్షేమ పథకాల గురించి గొప్పగా వక్కాణిస్తుంటారు. ద్వంద్వ ప్రమాణాలు పాటించడం ఈ సర్కారు పరివారానికి కరతలామకం. మరో ఉదాహరణ కూడా మీ ముందు ఉంచుతున్నాను. మోడీ గారేమో ట్రంప్ గారిని గాంధీ గారి సబర్మతి ఆశ్రమానికి తీసుకొని వెళ్తాడు. ఆయన పరివారగణం గాంధీ వ్యతిరేక దుష్ప్రచారాన్ని నిరంతరం కొనసాగిస్తుంటారు. ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి.ప్రజలందరి అభివృద్ధియే దేశాభివృద్ధి. ఏ సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన వారు అభివృద్ధి చెందకుండా దేశ అభివృద్ధిని కొనసాగించడం సాధ్యం కాదు. కాబట్టి సామాజికంగా, ఆర్థికంగా మరియు భౌగోళికంగా వెనుకబడిన వారి కొరకు ప్రభుత్వ చేయూత అవసరము. అది సర్కారు ప్రాథమిక బాధ్యత. ఈ బాధ్యతనుండి తప్పించుకోవడానికి ప్రజల యొక్క మానసిక సమ్మతి కొరకు తన పరివారం ద్వారా సర్కారు వారు చైతన్యవంతంగా సంక్షేమ పథకాలకు, ముఖ్యంగా ఉచిత పథకాలకు వ్యతిరేకంగా ఏదో రకమైన ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ప్రజల చేత ప్రజల కొరకు ఏర్పడిన ప్రభుత్వానికి బదులుగా కొంతమంది కార్పొరేట్ కంపెనీలకు మాత్రమే ఈ సర్కారు అనే భావాలను పెంచి పోషిస్తున్నారు. తమను మించిన రామ భక్తుడు లేరని తమను మించిన హిందూ ధర్మ పరాయణం లేరని సనాతన వారు లేరని జబ్బలు చర్చుకుంటున్న ఎందరో రామ భక్తులు రాముని పట్ల గల మంచి అభిప్రాయం దిగజారే విధంగా వ్యవహరిస్తున్నారు. ఏ దేవుడైన ప్రజల కొరకే అవతరించాలరని చెప్పబడుతుంది. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటున్నట్టు, రాముడు పేరుతో ప్రజా వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. నిరంకుశ విధానాలను పాటిస్తున్నారు. దైవత్వం వల్ల ప్రజలకు మేలు జరుగుతుంది. రాక్షసత్వం వల్ల ప్రజలకు నష్టం జరుగుతుంది. మరి ఆలోచించండి నేటి కేంద్ర ప్రభుత్వం అనుసరించే విధానాలు ఏమిటి? వాటిని రాముడు అనుసరించాడా అలాగైతే వివరణ ఇవ్వాల్సిన బాధ్యత సర్కారుది కాదా!
ఆచరించాల్సిన ఆదర్శాలు
